Happy Father's Day!!!



 మొన్న Father's day సెలబ్రేషన్ అని మావాడు స్కూల్ జూమ్ సెషన్లోకి లాగాడు నన్ను.

రాని నవ్వు నటిస్తూ తండ్రులు, వాళ్ళ పక్కన వంకర్లు తిరుగుతూ పిల్లలు స్క్రీన్ కి ఇటువైపు.వాళ్ళను అలరిస్తూ టీచర్లు మరోవైపు.
ప్రిన్సిపాల్ స్పీచ్,క్విజ్,పజిల్స్ అయ్యాయి.హమ్మయ్యా అనుకునేలోపు అసలు బాంబు పేల్చింది యాంకర్ టీచర్.పిల్లల తండ్రులు తమ తండ్రుల గురించి ఏదైనా చెప్పాలి అంది.నేను రాని ఫోన్ నటిస్తూ లేచి వెళ్ళిపొతుంటే మావాడు కసిరాడు.ఖాతరు జెయ్యకుండా నా రూంలోకి వెళ్తుంటే ఎదురుగా గుర్రుగా బుసలు కొడుతూ ఆమె.గోడకు కొట్టిన బంతిలా వెనుదిరిగి పిల్లాడి పక్కన కూర్చున్నా.
తండ్రుల ప్రసంగాలు మొదలయ్యాయి.అందులో ఒక అతను ఆవేశంలో మా తండ్రి మాకు మాత్రమే తండ్రి కాదు మా ఊర్లో చాలా మందికి తండ్రి అని అరిచాడు.సెషన్ ఆసాంతం నవ్వుతున్న యాంకర్ టీచర్ మొహంలో నవ్వు మాయమయ్యింది ఆ మాటకి.అస్తమానం ఆవులిస్తున్నఒక బట్టతల పేరెంట్ కళ్ళు తెలేసి చెవులు రిక్కించాడు ఆ మాటకి. ఇంతలో ఆ స్పీకర్ వెంటనే తేరుకొని తన తండ్రి చర్చి ఫాథర్ అని చెప్పడంతో కాస్త నిరాశకు గురయ్యి మళ్ళీ అవలించాడు అతను.
మరొకతను తన తండ్రి గురించి ఉటంకిస్తూ ఉద్వేగంగా అప్పట్లో అతను కాలి నడకన రెండు ఊర్లు ఒక నది దాటి బడికి వెళ్ళి కష్టపడి చదివిన ఘట్టం వివరించడానికి పటం వెయ్యబోయాడు. ఇంతలో పక్కనున్న అతని కొడుకు 'అలాంటప్పుడు grandpa school పక్కనే ఇల్లు rent తీసుకోవాల్సింది కదా నాన్నా' అని ఇకిలించాడు. ఆవులిస్తున్న బట్టతల అతను బొర్ర ఎగరేసి మరీ నవ్వాడు.
నా వంతు వచ్చింది.నేను ఎత్తుకోవడమే మా నాన్న గురించి నేను చెప్పేది ఎం లేదు అన్నాను... క్వశ్చన్ మార్క్ లో అవలించాడు బట్టతల అతను ...పాజిచ్చి...ఎందుకంటే నాకు నాన్న లేడు అంటూ జూనియర్ ఎన్టీఆర్ మాడ్యులేషన్ లో అన్నాను.చిన్నప్పుడే పోయిన మా నాన్న తాలూకు లేని జ్ఞాపకాలు నేను గిచ్చుకొని చెప్పలేనుగాని, ముగ్గురు పిల్లలని కష్టపడి పెంచిన నాన్నలాంటి మా అమ్మ గురించి చెబుతానని చెప్పాను చాలాసేపు.మా అమ్మ టాపిక్ వస్తే నాలో రేలంగి పొయ్యి గుమ్మడి పూనుతాడు.నా నేరేషన్ కి యాంకర్ టీచర్ మొహంలో నవ్వు మాయమయ్యింది.బట్టతల అతను ఆవులించడం మానేసాడు.అది నేను విజయంగా భావించాను.
గేర్ నాలుగులో వేసి - చివర్లో, నేను చిన్నప్పుడు మిస్ అయిన నాన్న పిలుపుని భర్తీ చేసుకోవడానికి ఇప్పుడు నా కొడుకుని 'నాన్నా' అని పిలుచుకుంటాను అన్నాను.అంతే.అప్పగింతలప్పుడు ఆడపిల్లలా ఏడ్చాడు భోరున మావాడు వాళ్ళ అమ్మని పట్టుకొని. ఆ క్షణంలో మా ఆవిడ చూసిన చూపుకి Thanks చెప్పి నా ప్రసంగం ముగించాను.
చదువు,ఈత,ఈల మెల్లిగా వాడే నేర్చుకుంటాడు. మా అమ్మలా ఎదుటివారి కష్టాలు విని చలించే గుణం ఉంది చూడండి వాడిలో.ఒక తండ్రిగా అది నాకు భలే ఇష్టం వాడిలో.
Happy father's day అమ్మ!

Comments

Popular Posts