ట్రాఫిక్ సిగ్నల్


 సూర్యుడు పాన్ నమిలి ఉమ్మిన్నట్టు చిక్కటి ఎరుపులో ఎదురుగా ట్రాఫిక్ సిగ్నల్(దీని దుంపతెగా,పోయినవారం నుండి హాంట్ చేస్తుంది సరసమైన పత్రికలో సదరు సత్తుపల్లి గృహిణి రాసిన కవిత)

ఎఫ్ఎం లో బాలీవుడ్ లేటెస్ట్ పార్టీ హిట్ మ్రోగుతుంది..వెనకాల ఓ ఆటోవాలా పిచ్చెక్కినట్టు హారన్ కొడుతున్నాడు..పాటలో సింగర్ ర్యాపాడిస్తున్నాడు..సాటి మానవజాతి మీద ఇద్దరిది ఒకేలాంటి అలక.
కారు కిటికీ అద్దం మీద టకటక చప్పుడు.ట్రాఫిక్ సిగ్నల్ మీద అడుక్కునే ముసల్ది - మొహంలో ఓ దీనమైన ఎక్స్ప్రెషన్ తో.ఆమె సిగ్నేచర్ ఎక్స్ప్రెషన్ అది.గత ఐదేళ్ళుగా చూస్తున్నాను ఆమెని.ఆ సిగ్నల్ ని కాంట్రాక్టు మాట్లాడుకున్నట్టు ఉంది.ఈ పాటికి ఖాజాగుడాలో ఓ ప్లాటు కొనేసే ఉంటది.తిరగేసి దులిపితే క్రెడిట్ కార్డు బిల్లు రిసీప్టులు రాలే నాలాంటి కార్పొరేట్ గుమస్తా ఆ ఆగర్భ శ్రీమంతురాలికి ఏమిచ్చుకునేది? కాపోతే ఆ టైంలో ఆమె టకటకల అసహనానికి గురవ్వకుండా ఆమెను పట్టించుకొనట్లు నటించడం ఒక ఆర్టు.అది నాకు అబ్బినట్టే.
సిగ్నల్కేసీ చూస్తున్నాను,ఎదో ఆలోచిస్తున్నవాడిలా.అలా శూన్యంలోకి పిచ్చిచూపులు చూస్తూ ఎంత సేపైనా ఉండగలడం నా ప్రత్యేకత..నా ధ్యానస్థితిని డిస్ట్రాక్ట్ చేస్తూ ఎదో కీచున శబ్దం.ఒక బైకర్ రెడ్ సిగ్నల్ జంప్ చేసి ఎదురుగా వస్తున్న కారుకి, యూ టర్న్ తీసుకుంటున్న బస్సుకి మధ్యలో సందులో నుండి పొదల్లోకి దూకిన కుందేలులా మాయమయ్యాడు.సీనును రివైండులో జూమ్ చేసి చూస్తే ,బైకర్ టీ షర్ట్ మీద స్విగ్గీ లోగో.The hunger saviour అని రాసి ఉంది..పాపం బిడ్డేడు, ఆకలికి అలమటిస్తున్న ఓ ప్రాణిని కాపాడే ప్రయత్నంలో తన ప్రాణాన్ని ఖాతరు జెయ్యలేదు.నిఖార్సైన అన్సంగ్ హీరో.
గుండె మార్పిడి కేసుల్లో ఆర్గాన్ డోనర్ గుండెని తరలించేప్పుడు ట్రాఫిక్ ఆపుతారు గాని..అలాంటి కేసులని స్విగ్గీ డెలివరీ వాళ్ళకు అప్పగిస్తే సరి.ఇటు ట్రాఫిక్ ఆగకుండా అటు గుండె ఆగకుండా డెలివరీ చేసే స్కిల్ సెట్ ఉంది వీళ్ళలో.
సిగ్నల్ ఆరెంజులో నుండి మెల్లిగా గ్రీన్ లోకి మారబోతోంది...తెలుగు సినిమా క్లైమాక్సు సీన్లో బ్యాక్గ్రౌండ్ స్కోరులా వెనకాల నుండి పెద్దపెట్టున సామూహిక శబ్దకాలుష్యం..కుటుంబ పెద్ద సడెన్గా పోతే మిగతా కుటుంబం పెట్టే శోకంలా...ఆ శబ్దతరంగాలకు ముందర వెహికిల్స్ చెల్లా చెదురయ్యి రోడ్డు క్లియర్ అవ్వోచ్ఛు అన్న కాస్త ఆశతో,బోలెడు అసహనంతో నగరపు జనాల ఉరుకులాట, మరో సిగ్నల్ వైపు!

Comments

Popular Posts