లుంగి


ఊహ తెలిసాక,రాత్రిళ్ళు నేను లుంగీ కట్టకపోవడం చాలా అరుదు.ఆ లుంగి నిద్రలో నా ఒంటి మీద నిలవడం అంతకన్నా అరుదు.మొలతాడు,పురికోసలు పనిచేయడం లేదని తోలుబెల్టు ట్రై చేసా.లాభం లేకపోయింది.ఓ సారి డాబా మీద పడుకున్న నేను పొద్దున్నే లేచి చూసుకుంటే...ఒంటి మీద కేవలం తోలుబెల్టు ఉంది.పక్కన్నే ఉన్న కరెంటు తీగల మీద లుంగి రెపరెపలాడుతూ ఉంది.ఆనాటి నుండి సమాజ శ్రేయస్సుని దృష్టిలో ఉంచుకొని నా లుంగి వాడకాన్ని కేవలం ఇండోర్స్ కే పరిమితం చేసా.తప్పనిసరి పరిస్థితుల్లో లుంగి కట్టుకు బయటికి వెళ్ళాల్సి వస్తే లోపల ప్యాంటు వేసుకోవడం మరిచిపోను.ఇంత కష్టపడే బదులు ఎంచక్కా షార్ట్స్,ట్రాక్స్ వాడి చావోచ్చుగా అని సకిలించే నోళ్ళు మూయించడానికి నా దగ్గర మూడు బలమైన కారణాలు ఉన్నాయి.

1. నేను పుట్టి పెరిగినదంతా ‘అగ్నిగుండం’ గా పేరొందిన ‘రామగుండం’లో.టౌన్ లో ‘50% డిస్కౌంట్ సేల్ ‘ ఆఖరి రోజని తెలిసినా సరే,ఆడాళ్ళని గడప దాటనీయకుండా భయపెట్టే ఎండ ఈ ప్రాంతం సొంతం.ఎండ దెబ్బ తాళలేక,వస్త్ర సన్యాసం చేయలేక అవస్థలు పడే మగాళ్ళకి ఊరటనిచ్చేది ఈ తేలికపాటి లుంగినే.

2. ఓసారి షార్ట్స్ వేసుకొని కిరాణా షాపుకి వెళ్ళిన నన్ను షాపు యజమాని బియ్యం బస్తాలు మోసే కూలీ అనుకోని పొరబడటం.

3. బెట్టుకుపోయి ఓ వారం రోజుల పాటు రాత్రిళ్ళు జీన్స్ వేసుకొని పడుకున్న మా నాగరాజు గాడికి ఇంట్లో వాళ్ళకి చూపించుకోలేని చర్మ సమస్యలు తలెత్తడం.

ఇలా నాలా,మనలో చాల మందికి లుంగీ వాడటానికి ప్రత్యేక కారణాలు ఉండకపోవచ్చు.కారణాలు ఉన్నా లేకున్నా ఈనాడు కుల,మత,ప్రాంతాలకతీతంగా మగాళ్ళ దైనందిన జీవితంలో ఒక భాగమై కూర్చుంది ఈ లుంగి.ఇంటికొచ్చిన అతిథికి కట్టుకోవడానికి లుంగి ఇవ్వకపోవడం నేరంగా పరిగణిస్తారు కొన్నిప్రాంతాల్లో.ఆఫ్ కోర్స్ ఈ లుంగి ఆఫర్ వెనకాల కొన్ని గుప్త లాభాలు ఉన్నాయనుకోండి.ఇంటికొచ్చిన వాడి మోహన ఓ లుంగి పడేస్తే,భోజనం అయ్యాక మూతి తుడుచుకోవడానికి,స్నానమయ్యాక ఒళ్ళు తుడుచుకోవడానికి విడిగా టవల్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు.ఫంక్షన్లలో ఆడాళ్ళకైతే జాకెట్ ముక్క,మగాళ్ళకు లుంగి గుడ్డ పెట్టేంతగా మన ఆచార వ్యవహారాలతో చట్టుకుపోయింది లుంగి.

ఆధునిక యాంత్రిక జీవన శైలితో సతమతమయ్యే నేటి మగాడికి ఆధ్యాత్మిక ప్రశాంతతని చేకూర్చడంలో ఈ లుంగి ఒక కీలక పాత్ర పోషిస్తుందని నా అభిప్రాయం.నా మట్టుకు నేను బాగా అలిసిపోయి ఆఫీస్ నుండి ఇంటికొచ్చాక లుంగి కట్టుకొని,బాల్కనీలో కాళ్ళు జాపుకొని కూర్చొని,పిల్లగాలి చల్లగా తగులుతుంటే ఆకాశంలోకి అలా చూస్తూ  సాంత్వన పొందుతూ ఉంటాను.నాలా మా ఫ్రెండ్స్ లో చాల మంది లుంగి ప్రియులున్నారు.ఆన్ సైట్ ఆఫర్ల మీద తరచుగా దేశాలు తిరిగే మా వటపత్ర సాయి గాడు లగేజులో లుంగీ లేనిదే కదలడు.ఏ దేశంలో ఉన్నా లుంగి లేనిదే నిద్ర పట్టదు వాడికి.ఎంత షార్ట్ ట్రిప్ అయినా సరే వాడి లగేజ్ లో కనీసం రెండు బ్యాగులుంటాయి.ఒక దాంట్లో ఆఫీస్ లాప్ టాప్ మరో బ్యాగు నిండా లుంగిలు ఉంటాయి.మా రాజేష్ గాడికి గళ్ళ లుంగిలంటే ప్రాణం.తీరిక సమయాల్లో లుంగి పరుచుకొని దాని మీద అష్టా చెమ్మా ఆడటం వాడికిష్టమైన వ్యాపకం.ఇహ నాగరాజు గాడైతే టైముకి ఇంట్లో లుంగి కనబడక పొతే అలిగి వాళ్ళావిడ లంగా కట్టుకు తిరిగి నిరసన తెలిపే ఉన్మాది. 

ఇదిలా ఉండగా ఓ రోజు ఆఫీసులో కొత్తగా జాయిన్ అయిన కొలీగ్ జార్జి కుట్టితో పిచ్చాపాటిలో తనది ఏ ఊరని అడిగా.సమాధానంగా “ I come from the land of lungis..Kerala” అని సకిలించాడు. నాకు వాడి సమాధానం రుచించలేదు. పైపెచ్చు నాకిష్టమైన లుంగిని వాడి రాష్ట్రీయ సొత్తు అన్నందుకు ఒళ్ళు మండింది.నేను వెంటనే ఆవేశంగా”మా రాష్ట్రంలో లుంగీలు విరివిగా వాడతాం.జనాభా,విస్తీర్ణం రీత్యా చూసినా మాదే మీకన్నా పెద్ద రాష్ట్రం కనుక అయితే గియితే మాదే ‘లుంగి ల్యాండ్’ కావాలి” అంటు ‘బ్రతుకు జట్కా బండి’ లో బాధితునిలా రంకెలేసాను.వాడు దానికి ఒక వెటకారపు నవ్వు నవ్వి వెళ్ళిపోయాడు....నేను నా విజయాన్ని మిగతా తెలుగు కొలీగ్స్ తో క్యాంటీన్లో సెలెబ్రేట్ చేసుకొని,అరగంట తరువాత నా సీట్లోకెళ్ళి మెయిల్ బాక్స్ ఓపెన్ చేసా.జార్జి కుట్టి గాడు ఏదో అటాచ్మెంట్ మెయిల్ పంపాడు.తన తప్పు తను తెలుసుకొని క్షమాపణ కోరుతూ గ్రీటింగ్ కార్డు పంపినట్టు ఉన్నాడు కుంక..మెయిల్ ఓపెన్ చేసా...అందులో ఫోటో చూసి నా కళ్ళు,నోరు తెరుచుకోవడం కేటగిరిలో పోటి పడ్డాయి.సబ్జెక్టు లైన్ లో “Now tell me, Whose land does lungi belong to?...hahahaha” అని ఉంది.

  


ఫోటో షాప్ చేసుంటాడెమో అనే డౌట్ తో గూగుల్ అంతా గాలించా.కుప్పలు తెప్పలుగా ఉన్నాయి లుంగిలల్లో ఉన్న మలయాళీ స్త్రీమూర్తుల ఫోటోలు...ఒక ఫ్యామిలీ గ్రూప్ ఫోటోలో అయితే చిన్నా చితక,ముసలి ముతక అనే తేడా లేకుండా ఇంటిల్లిపాది లుంగిల్లో ఉన్నారు.పండుగకి తానుల్లో కొన్నట్టున్నారు లుంగీ గుడ్డ.గాలింపులో భాగంగా నా అభిమాన నటి షకీలా లుంగిలో ఫోటో ఒకటి కనపడింది.ఉండబట్టలేక డౌన్లోడ్ పెడుతూ కింద ఎదో రాసి ఉంటే చదివా.”సినిమా షూటింగ్ అయ్యాక షకీలా వాడినా సదరు లుంగిని స్థానిక టెంట్ హౌస్ ఓనర్ భారీ మొత్తానికి సొంతం చేసుకున్నాడు” అని ఉంది.ఇంకేదో సైట్ లో చదివాను.కేరళ ఆర్థికంగా వెనకబడటానికి గల కారణాల్లో లుంగి వాడకం ఒకటట.లింగబేధం లేకుండా జనాలు కట్టుకున్న లుంగిని చీటికి మాటికి కాలితో లేపి మడిచికట్టి,కాసేపు ఆగి కిందకి వదిలి,ఇలా ఈ స్టంటుని లెక్కలేనన్ని సార్లు రిపీట్ చేస్తూ ప్రతీ పౌరుడు సగటున రోజుకి 3 గంటల ఉత్పాదక సమయాన్ని వృధా చేస్తున్నారట.ఓటమి క్రుంగుబాటులో ఉన్న నాకు ఈ వార్త కాస్త ఊరటనిచ్చింది. 

గూగుల్ గాలింపులో భాగంగా “లుంగి మ్యానువల్” లోని ఒక చక్కటి ఫోటోని లుంగి రంగు,రుచి,వాసన తెలియని నార్త్ ఇండియన్ కొలీగ్స్ ని చైతన్య పరిచే ఉద్దేశ్యంతో ఫార్వర్డ్ చేశాను.అదే ఫోటోని ఇక్కడ పెడుతున్నాను...మీలో ఎవరికన్నా లుంగి కట్టు విషయంలో అనుమానాలున్నా,లుంగి కట్టాలనే ఆసక్తి ఉండి ఎలా కట్టాలో తెలియకపోయినా క్రింది ఫోటో చూసి ప్రాక్టీసు చెయ్యొచ్చు.



గమనిక:  పై ఫోటోలో ఒకటవ పాయింట్లో ఉన్న “Wear something underneath” అనే వాదనతో విభేదించే పిడివాదులు చాలా ప్రాంతాల్లో ఉన్నారు.మరి మీరేమంటారు?;)

Comments

Popular Posts