Go Corona Go!!!



 మా ఫ్లాట్ ముందర ఫ్లాట్ ,డూప్లెక్స్. అందులో కృష్ణవంశీ సినిమాల్లోలా పిల్ల,పెద్దా,ముసలి,ముతక కలిపి రమారమి శ్రీలంక జనాభా ఉంటుంది.వేసవి సెలవులనుకొని భార్యాభర్తలు ఎవరి తరఫు బందువుల్ని వాళ్ళు పోటీపడి పిలిపించుకున్నారు కాబోలు.లేక, జాలిపడి దగ్గర్లో ఉన్న స్లమ్ము దత్తత తీసుకొని ఉండొచ్చు.ఏదైమైనా అది నాకవసరం లేని విషయం.

బాధల్లా, ప్రతీ జంటకు ఇద్దరు పిల్లన చొప్పున ఒక డజను పిల్లలు రికాము లేకుండా కామన్ కారిడార్ లో రేయిపగలు కలియదిరుగుతున్నారు. గిన్నెల్లో అన్నం వేసుకొని వారి వెంట వాళ్ళ అమ్మలు.ఆ వైభోగం చూస్తూ చైర్లు వేసుకొని గడప బయట వృద్ద జంటలు.హాళ్ళో టీవీలో హై వాల్యూమ్ లో జబర్దస్త్ చూస్తూ మిగతా జనం. కనీసం రాత్రుళ్ళు కూడా మెయిన్ డోర్ మూయడం లేదు.మొన్నో రాత్రి నిద్రపట్టక చెత్త బుట్ట బయట పెడదాం అని తలుపు తెరిస్తే , హాల్లో వరసగా సునామీలో కొట్టుకొచ్చిన శవాల్లా మనుషులు.ఒకని వంటిపై ఊడిన లుంగీని మరొకడు మొహంపై కప్పుకు పడుకున్నాడు.నాకొచ్చిన కోపానికి, కరోనా వచ్చి ఉంటే గడప మీద కూర్చోని వాళ్ళ మీద కనీసం పావుగంట దగ్గేవాన్ని.
ఇదిలా ఉంటే పొద్దున్నే కిచెన్లో నా మట్టుకు నేను అంట్లు తోముకుంటుంటే కారిడార్ లో అల్లరి చేస్తూ ఆ కోతి పిల్లలు.అందులో ఒకడు కారిడార్ లో స్టీల్ రేలింగ్ నాకుతున్నాడు. కిటికీలో నుండి - 'ఏయ్ బాబు..వద్దు..కరోనా వస్తది..లే అక్కడినుండి' అని కాస్త గట్టిగానే గదిమాను.రైలింగ్ నాకడం ఆపి ,నా వైపు చూసి వాడు ఏడుపందుకున్నాడు(పున్నమి నాగులో పౌర్ణమి రాత్రి చిరంజీవి కళ్ళలా ఉండే నా కళ్ళు చూసి దడుచుకొని కాబోలు).
వాడి ఏడుపుకి వాళ్ళ అమ్మ వెనకాల వాళ్ళ అమ్మ కూడా పరిగెత్తుకు వచ్చారు. వాళ్ళు ఎదో అనే లోపే "కరోనా-సామాజిక స్పృహ" అంశం మీద ఐదు పేజీల వ్యాసం గుక్కతిప్పకుండా అప్పజెప్పాను వాళ్లకి. 'లెఫ్ట్ లిబరల్ లా మాట్లాడుతున్నాడు,ఎందుకొచ్చిన రిస్కు?' అనుకున్నారేమో , గునుక్కుంటు పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయారు.
ఇప్పటి వరకు మళ్ళి పిల్లల చప్పుడు వినబడటలేదు కారిడార్లో. మెయిన్ డోర్ కూడా మూత పడింది.
ఖచ్చితంగా కిట్టీ పార్టీ ఆంటీలు హర్షించని అనాగరిక బూతులు తిట్టుకుంటూ ఉంటారు ఆ పిల్లలు నన్ను.చిన్నప్పుడు ఇంట్లో బాల్ పడితే తిరిగివ్వని అంకుల్స్ ఇళ్ళ మీద రాత్రుళ్లు రాళ్ళు విసరేవాన్ని నేను.అలాంటిది ఈ రోజు నేనే అలా తయారవ్వడం కాస్త బాధాకరమే.
ఇప్పుడు ఈ ఉదంతంలో నన్ను మీరెలా చూస్తారు?
A.బాధ్యతాయుతమైన పౌరుడు
B.శాడిస్టు అంకుల్

Comments

Popular Posts