పెళ్ళెందుకు ??? ... లొల్లెందుకు ???

ఎలాగైనా పెళ్ళి చేసుకోని , పెళ్ళి కాలేదనే నెపంతో నన్ను అవహేళన చేస్తున్న సోకాల్డ్ సభ్యసమాజపు అసభ్య జనాలకి గుణపాఠం నేర్పి , ఒక బ్రహ్మచారిగా నేనెదుర్కొంటున్న సామాజిక వివక్షని కూకటి వ్రేళ్ళతో పీకేద్దామని నిర్ణయించుకున్నాను ...

ఎప్పటిలాగే , ఆవేశంలో నిర్ణయమైతే తీసుకున్నాను గాని , తరువాత ఏమి చెయ్యాలో పాలు పోలేదు ..

ఇలాంటి క్లిష్టమైన నిర్ణయం తీసుకునేముందు , అసలు " పెళ్ళెందుకు ? " అని ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి అనుకున్నాను.. అనుకుందే తడవు " What Do you say Dude ? " అని అడిగాను నా ఆత్మారామున్ని ..

" నాకేం తెలుసు బే ? ముందటి బెంచీ వాడికే గతి లేక క్వశ్చన్ పేపర్‍ని తిరగ రాస్తుంటే , వెనక బెంచీ వాడు ఆన్సర్ చూపించమని అడిగినట్టుంది .. అవతలికి పో " అని మర్యాదగా మందలించాడు ఆత్మరాముడు ...

ఎమీ తోచక తల పట్టుకు కూర్చున్న నన్ను , మా కొలీగ్ హేమలత పరామర్శించింది ... విషయమంతా పూసగుచ్చకుండానే చెప్పాను ...

విషయమంతా విని , " ఇంకెన్ని రోజులు చేతులు తడుపుకుంటావు విజయ్ ??? నా మాట విని ఇంట్లో వాళ్ళు చూపించిన అమ్మాయిని చేసుకొని సెటిలైపో ?? " అంది నిట్టూరుస్తూ ..

" చేతులు తడుపుకోవడమేంటి ??? కాల్చుకోవడం కదా అనాల్సింది " అన్నాను మొహం చిట్లిస్తూ ..

ఇంతలో , " ఏంటబ్బా ? ఎంటీ సంగతులు ? " అంటూ సీన్‍లోకి ఎంట్రీ ఇచ్చాడు మా టీమ్‍మేట్ సుబ్బారెడ్డి ...

" ఆ .. రా ..రా .. సుబ్బారెడ్డి ... మంచి టైముకొచ్చావ్ " అంటూ ఆహ్వానించిన హేమలత వాయిస్ , మద్యాహ్నం ఆకాశవాణి రేడియోలో ప్రసారమయ్య్యే " పాడిపంట " ధారావాహికలో "రంగమ్మ" క్యారక్టర్‍ని తలిపించింది ..

" సుబ్బు , పెళ్ళయిన నువ్వైతే సరిగ్గా చెప్పగల్గుతావు ..కాస్త మన విజయ్‍కి పెళ్ళెందుకు చేసుకోవాలో అర్థమయ్యేట్టు చెప్పు" అంది హేమలత ముసిముసిగా నవ్వుతూ ..

" పెళ్ళికి ముందు హోటల్ తిండికి బాగా గ్యాస్ ప్రాబ్లమ్ ఉండెదబ్బా నాకు .. పెళ్ళి తరువాత మా ఆవిడ వంటకి దెబ్బకి తగ్గిపోయింది .." అన్నాడు సుబ్బారెడ్డి , త్రేన్చుతూ ..

" వాట్ డు యూ మీన్ ??? నా జీవితానికి సంబంధించిన " పెళ్ళి చేసుకోవాలి " అనే అత్యంత కీలక నిర్ణయాన్ని , నాకున్న గ్యాస్ట్రిక్ ట్రబుల్ ,నోటిపూత, సెగ్గడ్డలు వంటి మున్నగు ఆరోగ్య సమస్యలని ప్రాతిపదికగా చేసుకోని తీసుకోమంటావా యేంటి ? నెవర్ ... " అని వాళ్ళ మాటలని , నాకొచ్చిన ఇంపార్టంట్ అఫీషియల్ మెయిల్‍ని పట్టించుకోకుండా గూగుల్ టాక్‍లో చాట్ చేయడములో నిమగ్నమయ్యాను ..

ఇలా ఐతే విషయం తెగదని , పుస్తకాలు మంచి స్నేహితులనే విషయం గుర్తొచ్చి , సికింద్రాబాద్ రైల్వే ప్లాట్‍ఫారం మీద కొన్న " ౩౦ రోజుల్లో పెళ్ళి చేసుకోవడం ఎలా ?" బుక్ చదవడం మొదలెట్టాను ...

ఆలుమగల మధ్యన అనుబంధం " పైజామాలో నాడాలా , విస్తరాకులో చీపురు పుల్లలా పెనవేసుకొని ఉండాలి " లాంటి నగ్నసత్యాలతో పాటు ,పెళ్ళి చేసుకోబోయే బ్రహ్మచారులకి చక్కటి చిట్కాలు ఇచ్చారు పుస్తకంలో రచయిత కటుకోజు బ్రహ్మచారి గారు ...

ఆ చిట్కాల పరంపరలో , " ఎవరైనా సరే, పెళ్ళి చేసుకోవడానికి ఒక బలమైన కారణముండాలి .. ఎవరికివారు దాన్ని వెతుక్కోవాలి అని రాసుంది " ... ఆ కారణమే తెలిస్తే ఈ దిక్కుమాలిన పుస్తకం చదవాల్సిన అవసరమేందిరా నాకు ? అనవసరంగా 5౦ రూపాయల బొక్కెందుకురా బ్రహ్మచారిగా ?? అని తిట్టుకుంటూనే మిగతా చిట్కాల జాబితాని చదవడం కొనసాగించాను ..

ఇండియాలో , వివాహితులైన ప్రజల మీద తాజాగా జరిపిన సర్వేల ప్రకారం , ప్రజలు తాము పెళ్ళి చేసుకొవడానికి చెప్పిన కారణాలను విశ్లేశిస్తే , అతి ముఖ్యమైనవి నాలుగు రకాలని తేలాయి ... అవి ..

1. శృంగారం (80%) 2. సంతానం(పిల్లలు)( 10%) ౩. డబ్బు ( కట్నం)( 8% ) 4.సాంగత్యం( తోడు - నీడ ) ( 2% )

అన్ని ఆప్షన్స్ బాగానే తోచాయి నాకు ... ఏది ఎన్నుకోవాలో అర్థం కాక , పై నాలుగు ఆప్షన్స్ తో నాలుగు చీటీలు రాసి , కలబెట్టి వేసి , అందులో నుండి ఒక చీటిని కళ్ళు మూసుకొని తీశాను .. తెరిచి చూస్తే , అధిక శాతం జనాదరణ వున్న ఆప్షన్ గల చీటీ వచ్చింది .... " గుంపులో గోవిందులా ఉండలేని నా మనస్తత్వం " నన్ను తీవ్రంగా మందలించింది ...

ఏం చేయాలో తోచలేదు కాసేపు ... తళుక్కున ఒక ఆలోచన మెరిసింది .. వెంటనే చీటిలను చించి అవతల పారేసి , పంటలేసాను , నేనున్న గది మారుమ్రోగేలా ..."థూ , యెదవ .. నాలుగు ఆప్షన్లున్న ప్రశ్నకి పంటలేసి జవాబెతుక్కునే యెబ్రాసి మొహమూ నువ్వునూ " అన్న నా ఆత్మారాముడి తిట్టు మారుమ్రోగింది ఈ సారి గదిలో ....

సైలెంటయిపోయాను కాసేపు ... చేసేదేమి లేక , ఎప్పటిలాగే జీవితానికి సంబంధించిన కీలక నిర్ణయాలని కుటుంబ సభ్యులకే వదిలేసినట్టు , నా ఈ పెళ్ళి సంగతిని కూడా పెద్దల నిర్ణయానికే వదిలేశాను ..

నేను తీసుకున్న ఈ నిర్ణయానికి ఉక్కిరిబిక్కిరికి గురయ్యి , ఆనందం పట్టలేక , మిట్టమద్యాహ్నమనే విషయం మరచిపోయి రెండు చిచ్చు బుడ్లు . నాలుగు కాకరొత్తులు కాల్చారు మా ఇంట్లో వాళ్ళు ...

పొద్దున్నే వచ్చే పాలవాడి దగ్గ్గరి నుండి , రాత్రికి గస్తీ తిరిగే నేపాలి గూర్ఖ వరకు కనబడిన ప్రతీ ఒక్కడిని " మా అబ్బాయికి పెళ్ళి చేయాలనుకుంటున్నాము , మీకు తెలిసిన పిల్ల ఉంటే చెప్పండి " అంటూ అర్జీ పెట్టుకోవడం మొదలెట్టారు మా ఇంట్లోవాళ్ళు ...

పెళ్ళి బ్రోకర్లకు , అమ్మాయి తరఫునోళ్ళకు ఇవ్వాలనిచెప్పి , నన్ను దగ్గర్లో వున్న ఫోటొ స్టూడియోకెళ్ళి , పూలకుండీ పక్కన నిలబడి ౩ రకాల ఫోజులతో ( క్లోజప్ , మీడియం , లాంగ్‍షాట్ ) ఫోటోలు తీయించుకు పంపమని అడిగారు మా ఇంట్లోవాళ్ళు... అందుకు నిరాకరించిన నన్ను , క్రింది ఫోటోలో ఫోన్ పట్టుకు కూర్చుంది నేనే అని చెప్పి , ఫోటోలు పంచిపెడతామని బ్లాక్‍మెయిల్ చేశారు ...



ఏరియల్ వ్యూ తో కలిపి మొత్తం నాలుగు రకాల ఫోజులతో కూడిన ఫోటోలు దిగి పంపించాను ...

సరిగ్గా 4 రోజుల తరువాత , వరంగల్ జిల్లాలో ఒక మారుమూల ఊరిలో మా దూరపు బంధువుల తాలూకు అమ్మాయి ఉంది , చూడటానికి వెళ్ళాలని , వెంటనే ఇంటికి రమ్మని కబురు పంపారు మా ఇంట్లోవాళ్ళు ... పళ్ళెటూరమ్మాయి అయితే మాత్రమేంటి ? రోజా సినిమాలో అరవింద్ స్వామి అంతటోడు పల్లెటూరమ్మాయయిన మధుబాలని చేసుకోలేదా ? ఆమె మాత్రం క్లైమాక్స్ లో మొగుణ్ణి కాపాడుకోలేదా ఎంటీ ? అని నాకు నేను ధైర్యం చెప్పుకొని బయలుదేరా ..

జనాలతో క్రిక్కిరిసిన గదిలో ఇనుప చైరేసి కూర్చోబెట్టారు నన్ను .. సెక్స్ స్కాండల్‍లో పట్టుబడ్డ స్వామీజిని చూడటానికి వచ్చిన భక్తజనంలా తండోపతండాలుగా తరలివచ్చారు జనాలు నన్ను చూడటానికి ... చాలా ఇబ్బందిగా ఉన్నా చిరునవ్వుని చెరగనీయలేదు మొహం మీద ... నా పుట్టుపూర్వోత్తరాలు , పుట్టుమచ్చలతో సహా ప్రతీ విషయం అడిగి తెలుసుకొంటున్నాడు పిల్ల మేనమామ.. ఒక వైపు మా అమ్మమ్మ పిల్ల తండ్రిని తమ వంశవృక్షాన్ని ఒక ఫ్లోచార్ట్ గా గీసి భాగాలు గుర్తించమని వేపుకుతింటోంది ... ఇంతలో అమ్మాయిని తీసుకువచ్చి నా ఎదురుగా కూర్చోబెట్టారు ... చుట్టుపక్కలున్న అమ్మలక్కలు నన్ను చూసి ముసిముసిగా నవ్వారు , రిథమిక్‍గా ... సిగ్గుతో నా కాలి బ్రొటన వేళితో నేనేసిన ముగ్గుకి , క్రిందున్న కార్పెట్ కొద్దిగా చిరిగింది ... అమ్మాయిని చూద్దామని తలలేపా ... తలదించుకొని కార్పెట్‍కున్న దారపు పోగులని పీకుతుంది అమ్మాయి .. అంతగా తల దించుకునే పనేంచేసిందోనన్న అనుమానం నన్ను క్రుంగదీసింది కాసేపు ...

" తలెత్తి అబ్బాయిని చూడమ్మా .. " అన్న మా అమ్మమ్మ మాటకి ఉలిక్కిపడి , లేచి , నన్ను చూసింది అమ్మాయి ... ఈ సారి తలదించుకోవడం నా వంతయ్యింది , సిగ్గుతో ... కాసేపు చూపులు ఇచ్చిపుచ్చుకోని , కళ్లతో నవ్వుకున్నాం ..

"అమ్మాయిని ఎమన్నా అడగరా ? అలా బెల్లంకొట్టిన రాయిలా కూర్చుంటావేంటి ? " అన్న మా అమ్మమ్మ మాటలకి , ఉలిక్కిపడి లేవడం నావంతయ్యింది ఈ సారి ...

సడన్‍గా ఏమడగాలో తోచక , " టైమెంతయ్యింది .. " అనడిగా తత్తరపాటులో .. అమ్మలక్కలతో సహా అమ్మాయి కూడా పగలబడి నవ్వింది నా ప్రశ్నకి ... సిగ్గుతో కూడిన అవమానంతో ఇంకాస్త చించా కార్పెట్‍ని కాలి వేలితో ..

కాస్త ధైర్యం తెచ్చుకోని " మీరు సినిమాలు చూస్తారా ? " అనడిగి , మా అమ్మమ్మకేసి చూశా .. " నీకున్న సినిమాపిచ్చి అందరికీ తెలవాలట్రా కటౌట్ యెధవ " అన్నట్టూ చిరాగ్గా ఒక చూపు చూసింది నన్ను ..

" చాల తక్కువండీ ... భక్తి రస సినిమాలైతే బాగా ఇష్టంగా చూస్తాను ... " అంది మొహం మీద పడుతున్న ముంగిరిలు సవరించుకుంటూ ...

" అవునా ... మీరు రీసెంట్‍గా చూసిన భక్తి సినిమా ఎంటండీ " అనడిగాను రెట్టించిన ఉత్సాహంతో ..

" పాండురంగడు " అంది తలదించుకొని ...

" పాండురంగడా ????????? నేనడిగింది భక్తి సినిమా గురించండీ , బూతు సినిమా గురించి కాదండీ .." అనన్నాను కాస్త చిరాగ్గా ..

" నేను చెప్పింది అదేనండీ ... బాలక్రిష్ణ హీరోగా వచ్చిన పాండురంగడు సినిమానండి , మొత్తం మా ఫ్యామిలీ కలిసి చూశాము " అంది గోముగా ..

అప్పటివరకు కోలాహలంగా వున్న గది నిశ్శబ్ధంగా మారింది ... మా ఇంట్లోవాళ్ళు ఒక్కరొక్కరుగా బయటికి వెళ్ళిపోయారు .. మారుమాట్లాడకుండా నేను మా వాళ్ళని ఫాలో అయ్యాను ...

ఒక నెల గడిచింది ... పాండురంగడు ఎపిసోడ్ తరువాత మల్లి పెళ్ళి మాట తియ్యడానికే భయపడ్డారు మా ఇంట్లోవాళ్ళు ... ఈ సారి కాస్త చదువుకోని , ఉద్యోగం చేసే సిటీ అమ్మాయిని చూడమని చెప్పాను మా వాళ్ళకి ..ఉద్యోగ రీత్యా నేను పూణెలో ఉంటాను ... పూణెలోనే ఉంటూ ఉద్యోగం చేస్తున్న అమ్మాయి ఉందని , వివరాలన్ని నాకు మెయిల్ చేశాడు నా మేనమామ ... అమ్మాయి మొబైల్ నంబర్ తీసుకొని కాల్ చేసి మాట్లాడి , వీకెండ్ కలుద్దామనుకొన్నాము ... అనుకున్న సమయం కంటే కాస్త ఆలస్యంగా చేరుకున్నాను , మేమనుకున్న స్ఫాట్‍కి ... షాపింగ్‍మాల్ రద్దీగా ఉంది , వీకెండ్ కనుక .. అమ్మయికి కాల్ చేశాను .. ఐసిఐసిఐ ఎటిఎమ్ ముందర నిల్చోనున్నాను అంది .వెతుక్కుంటూ వెళ్ళాను ,ఏటిఎమ్ దగ్గరికి ...

అక్కడ ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు .. అందులో ఒకమ్మాయి సన్నగా , నాజుగ్గా , జుట్టు విరబోసుకొని , కూలింగ్ గ్లాసెస్ పెట్టుకోని అప్సరసలా ఉంది ... మరొక అమ్మాయి , జీన్స్ మీద సల్వార్ కమీజ్ టాప్ వేసుకొని , కాళ్ళకు పట్టీలు పెట్టుకొని , జడ వేసుకోని నుదిటిన కాస్త విభూది మార్క్ కి తోడు , బిందీ కూడా పెట్టుకుంది ... ఇంతటి ఎక్స్ పెరిమెంటల్ వేషధారణ భూప్రపంచంలో చేయగల్గే గట్స్ కేవలం మన తెలుగుమ్మాయిలకే ఉంటుందన్న కాన్ఫిడెన్స్ తో వెళ్ళి " హాయ్ సుజాత " అని పలకరించాను ...

" హే విజయ్ ... హౌ ఆర్ యూ ... ఐయామ్ ఫైన్ .. థ్యాంక్స్ " అని విష్ చేసింది .. కుశలప్రశ్నల తరువాత పక్కనున్న రెస్టారెంట్‍కి వెళ్ళి కూర్చున్నాము ... రెండు ఫ్రూట్ జ్యూస్‍లు ఆర్డర్ చేశాను .. రెండు తనే తాగేసింది..తన బాల్యం,కౌమార, యవ్వన దశల్లో జరిగిన వివిధ సంఘటనల సమాహారముతో నాన్‍స్టాప్ గా మాట్లాడుకుంటూ పోయింది ... నిప్పుల మీద కూర్చున్నట్లనిపించింది నాకు ... ఒక స్ట్ర్రాంగ్ టీ ఆర్డర్ చేశాను తలనొప్పి భరించలేక ... " ఒకటే చెప్పావే , నీకొద్దా " అంది .. దీనవదనంతో , రెండు తీసుకురమ్మన్నట్టూ బేరర్‍కి సైగ చేసాను ...

" హేయ్ విజయ్ సలీం సినిమా చూశావా ? సూపర్ సినిమా కదు " అంది ..
మూగకేక పెట్టాడు ఆత్మారాముడు ... కంటతడి పెట్టకుండా ఏడ్చాను...

ఇక ఇలా ఐతే లాభం లేదనుకోని , ఆ నిరంతర వాగుడు స్రవంతికి అడ్డుకట్ట వేయాలని డిసైడయ్యి , " వీకెండ్స్ లో ఎం చేస్తుంటావ్ ? " అనడిగాను ..

" బట్టలుతుక్కోని , నిద్రపోతానంది " ...

అరనిమిషం సైలెంటయిపోయాను ..తేరుకోని " ఆ తరువాత ఎమి చేస్తావ్ అనడిగాను " కూరుకుపోయిన గొంతుతో ..

" ఏముంది , ఆరిన బట్టలని ఇస్త్రీ చేసుకోని , మళ్ళి పడుకుంటాను .... " అంది గిగిల్ చేస్తూ ..,

" నిన్ను చేసుకుంటే , టైమ్‍పాస్ కాట్లేదని చెప్పి కాలనీ వాళ్ళ బట్టలుతికే రకమే నువ్వు దిక్కుమాలిందానా " అని కసిగా తిట్టుకున్నా లోలోన . బయటికి నవ్వుతూ నటిస్తూ ...

" అలా కాదు సుజతా , నీకంటూ కొన్ని హాబీస్ ఉంటాయి కదా , వాటి గురించి అడిగాను .. " అనన్నాను అసహనంగా ..

" హాబీస్ అంటూ ప్రత్యేకంగా ఎమీ లేవు కాని ... న్యూస్‍పేపర్లు , వీక్లీస్‍లో వచ్చే సినిమా పోస్టర్స్ లో ఉన్న హీరోయిన్లకి , మీసం లేని హీరోలకి మీసాలు, గడ్డాలు గీయడం అంటే చాలా ఇష్టం .. " అంది ముసిముసిగా నవ్వుతూ ...

నాకు బాధతో కూడిన కోపం నషాళానికి ఎక్కింది ...

" మరి నీ హాబీస్ ఎంటి విజయ్ ???? అనడగింది ఆ వాగ్దేవి ( వాగుడు + దేవి ) ...

" చాలానే ఉన్నాయి .. బాత్రుంలో ఎవరన్నా దూరితే బయటీ నుండి గడి పెట్టేయ్యడం , దుమ్ము పట్టిన కారు అద్దాల మీద పేర్లు రాయడం , ముక్కులో చీపురు పుల్లలు పెట్టుకోని తుమ్మడం , దక్షిణమధ్య రైల్వేస్ టాయిలెట్లలో బూతుబొమ్మలు గీయడం , నీలాంటి అమ్మాయితో హోటల్‍కి వచ్చినప్పుడు బిల్ల్ కట్టకుండా పారిపోవడం etc. " అని వెనక్కి తిరిగి చూడకుండా పరిగెత్తాను..

ఇంటికెళ్ళాక మా అమ్మమ్మకి ఫోన్ చేసి " ఇంకా సంబధాలు చూడకండి .. నేను సన్యాసం తీసుకోబొతున్నాను " అని చెప్పి , ఆరంజ్ కలర్ జీన్స్ , టీ షర్ట్ కొనుక్కోవడానికి బట్టల కొట్టుకి బయలుదేరాను ...

Comments

Malakpet Rowdy said…
Dude, I was literally rolling on the floor laughing, reading this. You pose a serious threat to Rendu Rellu Aaru's reputation!
సీత said…
మొదటి లైన్ చదవగానే ఇవ్వాళ నాకేదో మూడింది అని అర్దమైపోయింది , నీ టపా చదువుతూ ఆపకుండా నవ్వుతూనే ఉన్న నన్ను ఇంట్లో జనాలు ఎర్రగడ్డ లో చేర్పించేస్తారేమో అని కంగారేసింది విజె , లైన్ లైన్ కి హ్యూమర్ అత్యద్భుతంగా పండించావ్ , ప్రతి లైన్ కి ఒక పంచ్ , ప్రతి పంచ్ భయంకరంగా నవ్విస్తుంది , హేమలత , సుబ్బారెడ్డి , మీ ఇంట్లో వాళ్ళు , ప్రత్యేకంగా మీ అమ్మమ్మ ఫ్లోచార్ట్ గీసి భాగాలను గుర్తించమనటం , పెళ్ళి చూపుళ్ళో జరిగిన సం"ఘటన"లు , యిరగదీసావ్ , కొత్త టపా కోసం ఇక ఎదురు చూపులు మొదలు మాకు , త్వరగా కొత్త పోస్త్ వేసి బ్రహ్మచారులకి సభ్యసమాజపు , అసభ్య జనం నుంచి విముక్తి ప్రసాదించండి సార్ , విముక్తి ప్రసాదించండి సార్ . మొత్తానికి amazing and awesome ......
Malakpet Rowdy said…
మరొక అమ్మాయి , జీన్స్ మీద సల్వార్ కమీజ్ టాప్ వేసుకొని , కాళ్ళకు పట్టీలు పెట్టుకొని , జడ వేసుకోని నుదిటిన కాస్త విభూది మార్క్ కి తోడు , బిందీ కూడా పెట్టుకుంది ... ఇంతటి ఎక్స్ పెరిమెంటల్ వేషధారణ భూప్రపంచంలో చేయగల్గే గట్స్ కేవలం మన తెలుగుమ్మాయిలకే ఉంటుందన్న కాన్ఫిడెన్స్ తో
____________________________________

This is the best!!!!!!
spoorthi said…
hhahaha chala bagundandi mee pelli patlu..ee blog chadivaka nenu face chesina oka potential groom gurinchi cheputanu..so ee sadaru candidate phone chesina first time..emi chestaru me hobbies enti ani adiigithe..shopping chestanu..grocery shopping oka 2-3 hrs padutundi ante..bachelor aina itanu em shopping chestadu ra anni gantalu ani adigithe..emundi 2-3 stores kelli ekkada veggies takkuva vunnayo akkada kontanu ani chepithe naku dimma tirigi mind block ayindi. amayi ni aina nene eppudeppudu shop nundi bayata padatana ani eduru chustunta vedevadra babu..so next emaina variety foods/restaurants try chestara ani adiga..topic maruddam ani...atanu nenu usa lo 4 years ga vunna gani ento opika ga roju vachi nene vandukoni tintanu..naku ee sari pakka ga ardham ayindi..itanni chesukunte roju vanta chesukoni ginnelu kadukkuntu kurchovalsinde ani :P poni emanna impress chese mukkalu cheptademo ani vechi chusa....em cheppado telusa..nenu roju god book chaduvukunta..parents cheppina mata vintanu..ma friends andaru nuvvu ee kalam puttalsina vadivi kadu ra antuntaru ani utsaham ga cheppadu..ivanni cheyyadam tappu kadu...but maree kala poshana lekunda ammayi tho first matladavalsina vishayalu aithe kavu. vinagane decide ayipoya..nenu kalalo kuda ilanti atanni cheuskonu ani..sare ivanni intlo chepudama ante..ivi vinna intlo vallu naku tikka ani decide chesaru. inta bangaram lanti abbayi ni vaddantunnavu ani :P me laga orange t shirt konukkoni ee himalaya lako phone lu email lu andani duraprantaniki vellipovali ani kala gantu..selavu :)
విజయ్ గారూ,
అబ్బ నవ్వినవ్వి నా డొక్కలన్నీ పట్టేశాయండీ.....ఏకబిగిన మీ కథలన్నీ చదివేశా..ఇదిలేదు,అదిలేదు ప్రతి సన్నివేశం "గావుకేక"లు పెట్టించింది...మీ అమ్మమ్మ గారి హాస్యం ఇంకా కేక....ఇంతకీ మీ పెళ్ళి ప్రయత్నాలు ఫలించాయా,లేదా?అంత handsome ఉన్న మీకే అన్ని కష్టాలైతే, మామూలు వాళ్ళ పరిస్థితి ఏంటో మరి..
Unknown said…
This comment has been removed by the author.
Unknown said…
Anna..Nee creativity ki antham leda..
emanna adagamani ammamma ante.." టైమెంతయ్యింది .. " ani tingaraga aduguthaava..great..hahhaa..anna mee hobbies kooda asalu koththa alochanau rekettistunnayi..
బాత్రుంలో ఎవరన్నా దూరితే బయటీ నుండి గడి పెట్టేయ్యడం , దుమ్ము పట్టిన కారు అద్దాల మీద పేర్లు రాయడం, నీలాంటి అమ్మాయితో హోటల్‍కి వచ్చినప్పుడు బిల్ల్ కట్టకుండా పారిపోవడం ..final hobby arupulu.. nenu kooda chinnaga aa hobby ni alavarchukuntaa.. :D
sanyaasam teesukovataaniki jeans store ki velle modern swamijini mimmalne choostunnaa...may be Nitya(Kama)Nanda Swamiji Inspiration anukuntaa..hahhaha.
Finally your post crossed my expectations...simply superb creative comedy...

కిరి కిరి lo aa Rajesh Character evaro telsukovaali ani vundi anna..coz..same to same jeevi maa batch lo vunnadu anduku..hahhaa
KumarN said…
"జీన్స్ మీద సల్వార్ కమీజ్ టాప్ వేసుకొని , కాళ్ళకు పట్టీలు పెట్టుకొని , జడ వేసుకోని నుదిటిన కాస్త విభూది మార్క్ కి తోడు , బిందీ కూడా పెట్టుకుంది "

Yup that was the best. So entertaining to watch 'em :-)
chakri said…
మీ గావుకేక తెగ నవ్వించింది.
"బెల్లం కొట్టిన రాయి" మీద ఒక టపా రాగయలరు.
ha..ha...ha...కెవ్వు>>>>> కేక.
౩౦ రోజుల్లో పెళ్ళి చేసుకోవడం ఎలా ? (year of the joke).
రామ! రామ! సన్యాసులుకి జీన్స్ , టీ షర్ట్? మీ టపా చదువుతూ ఆపకుండా నవ్వుతూనే ఉన్నాను. మొత్తానికి అదరగొట్టేసారు.
vkc said…
hahahaha !... climax keka !
pellante pyjamanaa.... !!
vinnade chadiva... aina navvocchindi !
"మన రామ గుండం లోని N.T.P.C గొట్టాల్లా మీరు ఎక్కడికో వెళ్లి పోతున్నరండి". : ): ): )

చాలా బాగుంది మీ టపా.
Anonymous said…
vj nee blog ,nee kathalu superb.navvi navvi edchanu.the best comedy read in recent times.inni prayatnala taruvathaina pelli kudiri undaali!!!!pl.continue{blogging}
priya said…
nee blog nijangane keka.after all these trials....oka inti vaadivi avutunnanduku santosham.
chaduvutunnata sepu apakunda navvu.santhu bhayapadi,choosi ,join ayyadu naato navvadaniki.he liked HELL..MATE so much.u can try for some movies as well.
నవ్వులతో గావు కేక పెట్టించారు .. మీ బ్లాగ్ ని బుక్ మార్క చేసాను ..
కొత్త పోస్ట్ కోసం ఎదురుచూస్తు
andhrajyothi said…
mee article april 1st aadivaaram andhrajyothilo sankshipthanga prachuristhunnam.
-editor, andhrajyothi
faiyazjaely said…
How to withdraw winnings - DRMCD
You can also withdraw winnings without taking any money and titanium tubing lose 진주 출장마사지 by taking 밀양 출장마사지 any currency, including 양주 출장샵 your account balance. However, you 동두천 출장안마 can Jun 6, 2020 · Uploaded by MrC

Popular Posts